Monday, June 14, 2010
అట్టహాసంగా టీ20 టాలీవుడ్ టోర్నమెంట్
సినీ తారలంతా నాలుగు జట్లుగా పోటీపడ్డ టి20 టాలీవుడ్ ట్రోఫీ టోర్నమెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల కేరింతలు, కేకల మధ్య అట్టహాసంగా, సందడిసందడిగా జరిగింది. చిరు చీతాస్ (చిరంజీవి), బాలయ్య లయన్స్ (బాలకృష్ణ), నాగ్ కింగ్స్ (నాగార్జున), వెంకీ వారియర్స్ (వెంకటేశ్) జట్లు ట్రోఫీ కోసం పోటీపడ్డాయి.
టోర్నమెంట్ ఆరంభ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హైదరాబాద్ మేయర్ కార్తీకరెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, మాజీ రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి, డాక్టర్ మోహన్‌బాబు, 'మా' అధ్యక్షుడు మురళీమోహన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
navya.ఈ సందర్భంగా మోహన్‌బాబు చేతుల మీదుగా 'మాస్టార్స్ డాట్ కామ్' పత్రికను 'మా' ప్రారంభించింది. బాలయ్య లయన్స్, వెంకీ వారియర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో వెంకీ జట్టు ఏడు వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. టాస్ ఓడిపోయి, తొలుత బ్యాటింగ్ చేపట్టిన లయన్స్ జట్టు కేవలం 59 పరుగులకే ఆలౌట్ కాగా, వారియర్స్ జట్టు లక్ష్యాన్ని కేవలం సగం ఓవర్లలోనే అధిగమించింది.
లయన్స్ జట్టులో ఎన్టీఆర్ ఏడవ నెంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగి చివరిదాకా నాటవుట్‌గా నిలిచాడు. అంతకుముందు ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా వ్యవహరించి మూడు క్యాచ్‌లు పట్టుకున్నాడు. రాత్రంతా వర్షం పడి మైదానమంతా తేమగా మారడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్ జట్టు పరుగులు తీయడానికి నానా తంటాలు పడింది.
ఈ మ్యాచ్‌లో అన్నదమ్ములు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ ప్రత్యర్థులుగా తలపడటం గమనార్హం. ఎన్టీఆర్‌కి వారియర్స్ జట్టు తరపున కల్యాణ్‌రామ్ బౌలింగ్ చెయ్యడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే మొన్ననే యాభయ్యవ పుట్టినరోజు జరుపుకున్న బాలకృష్ణ ఫీల్డ్‌లో చురుగ్గా వ్యవహరించడం, మీడియం పేస్‌తో రెండు ఓవర్లు బౌలింగ్ చెయ్యడం అందరినీ ఆకట్టుకుంది.
వారియర్స్ జట్టులో ఓపెనర్ కార్తీక్, ఐదవ నెంబర్ బ్యాట్స్‌మన్ ఆదర్శ్ బ్యాటింగ్‌లో బాగా రాణించారు. ఈ మ్యాచ్‌కి నిర్మాతలు డి. సురేశ్‌బాబు, కె.ఎల్. నారాయణ అంపైర్లుగా, నటుడు ప్రకాశ్‌రాజ్ థర్డ్ అంపైర్‌గా వ్యవహరించారు.
ఈ పోటీలకు చీర్ లీడర్స్ కూడా ఆకర్షణగా నిలిచారు. వారితో నటులు మనోజ్, అలీ, రఘు సరదాగా డాన్స్‌చేసి, ప్రేక్షకుల్ని అలరించారు. అంతకుముందు తన ప్రసంగంలో నాలుగు జట్లూ విజయం సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అనగా, పోటీలో ఒక్కరే గెలుస్తారనీ, ఆ ఒక్కరెవరో తనకు తెలుసుననీ మోహన్‌బాబు చమత్కరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment